సీతారాంపేట్‌లో అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు!
మినిట్ 2 మినిట్, ఇబ్రహీంపట్నం (ఆగస్ట్ 28): ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట్ గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతర గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే మహిళలు పట్టు వస్త్రాలు ధరించి, కలశాలతో డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పూలతో సర్వాంగసుందరంగా అలంకరించిన ఆలయ ప్రాంగణం భక్తుల శివసత్తుల పూనకాలతో మారుమోగింది.
ఈ వేడుకల్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ జాతరలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తాళ్ల జంగయ్య గౌడ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా.. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
