తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అగా ఖాన్ ఫౌండేషన్ ఉమ్మడి వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం కొనియాడారు. ఇటీవల శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణను ఫౌండేషన్ సహకారంతో పూర్తి చేసినట్లు గుర్తుచేశారు.
మూసీ నది పునరుజ్జీవనంతో పాటు పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి పురాతన భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని సీఎం కోరారు. ఉస్మానియా ఆసుపత్రికి గోషామహల్లో నూతన భవనం నిర్మిస్తున్నామని, పాత భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దుతామని వివరించారు. మూసీ ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కోసం అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరుకావాలని ప్రిన్స్ రహీమ్ను ఆహ్వానించారు. 30 వేల ఎకరాల్లో నెట్-జీరో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
