ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోస్యం.. టీడబ్ల్యూయూ గెలుపే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పిలుపు

RTC Elections

RTC Elections

RTC Elections:  తెలంగాణ ఆర్‌టీసీ (టీజీఎస్‌ఆర్‌టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల పర్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 9న నిర్వహించనున్న ఆర్‌టీసీ యూనియన్ ఎన్నికల్లో ‘తెలంగాణ ఆర్‌టీసీ వర్కర్స్ యూనియన్’ (టీడబ్ల్యూయూ – రిజిస్ట్రేషన్ నంబర్ 4-4522)కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా టీడబ్ల్యూయూ పనిచేస్తోందని తెలిపిన మహేష్ కుమార్ గౌడ్.. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, సీటీ కాంగ్రెస్ ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌టీసీ డిపోలలో టీడబ్ల్యూయూ యూనియన్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, ఇతర ఏ యూనియన్లను ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు ఆర్‌టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని, సమన్వయాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఇన్‌ఛార్జిని నియమించింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను ఈ ఎన్నికల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడించారు. బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆర్‌టీసీ కార్మికులతో సమన్వయం చేసుకుంటూ, టీడబ్ల్యూయూ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.