పార్లమెంట్‌లో మళ్లీ పొలిటికల్ హీట్.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు మోదీ సర్కార్ కసరత్తు!

Parliament Session

Parliament Session

Parliament Session: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులు మరోసారి తెరపైకి వచ్చాయి. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు పార్లమెంట్ ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశమయ్యేలా చూడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌లను కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అవసరాలను బట్టి డిసెంబర్ 3 వరకు ఈ ప్రత్యేక సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.

కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

గత ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ఇప్పటివరకు ప్రోరోగ్ (పూర్తిగా ముగింపు) చేయకపోవడంతో, తక్కువ వ్యవధిలోనే తిరిగి సమావేశపరిచే వెసులుబాటు ప్రభుత్వానికి కలిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. గతంలో లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక నిలిచిపోయిన డీలిమిటేషన్ ఆధారిత మహిళా రిజర్వేషన్ బిల్లుకు కొన్ని కీలక సవరణలు చేసి, మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

వేడెక్కనున్న పార్లమెంట్:

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంపై విపక్షాలు గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) అంశంపై ఆందోళన ఉధృతం చేయాలని కాంగ్రెస్ సహా విపక్ష కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ పరిణామాల మధ్య నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు అత్యంత వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.