NHAI: నెల‌కు రూ.350కే టోల్ పాస్.. ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్!

నెల‌కు రూ.350కే టోల్ పాస్..
ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్!

టోల్ ప్లాజాకు 20 కి.మీ పరిధిలోనే ఈ అవకాశం

వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి

‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్‌ ద్వారా ఇంట్లో నుంచే ఈ-పాస్

నేరుగా ఫాస్టాగ్‌కే లింక్.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఆన్‌లైన్ సేవలు

మినిట్ 2 మినిట్, నేషనల్ బ్యూరో (ఆగస్ట్ 2 2): జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీపి కబురు అందించింది. నెలకు కేవలం రూ.350కే నెలవారీ టోల్ పాస్ పొందే నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా, పూర్తి డిజిటల్ విధానంలో ఆన్‌లైన్ ద్వారానే ఈ-పాస్ పొందే వెసులుబాటును కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న 121 టోల్ ప్లాజాలకు ఎన్‌హెచ్‌ఏఐ ఈ సేవలను విస్తరించడంతో స్థానిక వాహనదారులు ఎలాంటి డాక్యుమెంట్లు నేరుగా సమర్పించకుండానే ఇంట్లో నుంచే పాస్ పొందే అవకాశం లభించింది.

అర్హతలు ఇవే:
నిర్దేశిత టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న స్థానిక నివాసితులు మాత్రమే ఈ పాస్‌కు అర్హులుగా ఎన్‌హెచ్‌ఏఐ గుర్తించింది. ఈ మంత్లీ పాస్ సదుపాయం కేవలం సొంత, ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర పనుల నిమిత్తం ప్రతిరోజూ ఒకే టోల్ ప్లాజా దాటే స్థానికులకు ఈ నిర్ణయం వల్ల భారీగా ఆర్థిక భారం తగ్గనుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ కోసం ఎన్‌హెచ్‌ఏఐ ప్రభుత్వ డేటాబేస్‌లతో లింక్ చేసింది. దరఖాస్తుదారుడి ఇంటి చిరునామాను నిర్ధారించడానికి డిజిలాకర్‌ను, వాహనం వివరాలను సరిచూసేందుకు ‘వాహన్’ పోర్టల్‌ను ఉపయోగించనున్నారు. అడ్రస్, వాహన వివరాలు సరిపోలిన వెంటనే, లోకల్ పాస్ ఆటోమేటిక్‌గా వాహన ఫాస్టాగ్‌కు (FASTag) లింక్ అవుతుంది.

దరఖాస్తు విధానం:
మంత్లీ లోకల్ పాస్ కోసం అర్హులైన స్థానిక వాహనదారులు ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన అధికారిక ‘రాజ్‌మార్గ్ యాత్ర’ (Rajmarg Yatra) మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుని పాస్ పొందవచ్చు. టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా నేరుగా ప్రయాణించే మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో, బారియర్-లెస్ టోలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సన్నాహాలు చేస్తోంది. న్యూఢిల్లీలో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.