Revanth Reddy: రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, కొన్ని రాజకీయ పార్టీలు దానిపై దాడికి కుట్రలు పన్నుతున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది.
ఓట్లు తొలగించి అక్రమాలకు పాల్పడుతున్నారు!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ సమాన న్యాయం, హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ రూపకల్పన జరిగిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు నాలుగోసారి సైతం అధికారాన్ని నిలబెట్టుకుని, ప్రధాని పదవిని శాశ్వతం చేసుకోవడానికి మోదీ కుట్ర పన్నుతున్నారని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పేదలు, గిరిజనులు, ఆదివాసీలకు చెందిన 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.
90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి!
దేశ స్వాతంత్ర్య పోరాటంలో అహింస ద్వారా విజయం సాధించిన చరిత్ర గాంధీజీకి, కాంగ్రెస్ పార్టీకి ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీ నేతలను ‘గాడ్సే వారసులు’గా అభివర్ణించిన ఆయన, రాబోయే ఎన్నికలు ‘గాంధీ వారసులు వర్సెస్ గాడ్సే వారసులు’ మధ్య జరగబోతున్నాయని పేర్కొన్నారు. దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, దేశాన్ని కాపాడటం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 అసెంబ్లీ, 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మూడుసార్లు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వాన్ని నాలుగోసారి ప్రజలు అప్రమత్తంగా ఉండి అడ్డుకోవాలని కోరారు.
