కవిత కొత్త అస్త్రం ‘తెలంగాణ రుద్రమ సేన’.. రాజకీయాల్లో మహిళల కొత్త శకం!

Rudrama Sena

Rudrama Sena

Rudrama Sena: తెలంగాణ మహిళా రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని, మహిళలు పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు తమ సత్తా చాటాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘మహిళలు-రాజ్యాంగం’ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా నామకరణం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కష్టపడే మహిళలకు తగిన అవకాశాలు

ఇకపై మహిళల రాజకీయ ప్రస్థానం ఒక కొత్త దిశగా సాగుతుందని, పార్టీ కోసం కష్టపడే మహిళలకు తగిన అవకాశాలు కల్పించే బాధ్యత తనదని కవిత భరోసా ఇచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా మహిళలు ఎదిగేందుకు ఆర్థికంగా, మానసికంగా పూర్తి అండగా ఉంటామని ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలు, నక్సలైట్ ఉద్యమాల్లోకి వెళ్లిన మహిళలతో పాటు ఇతర ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ మహిళలకు అవమానాలు, ఇబ్బందులు తప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు.

మహిళల చరిత్రను మహిళలే రాసుకోవాలి!

బస్సు, రైలు, కార్యాలయం ఇలా ఎక్కడికి వెళ్లినా మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిపై రాజకీయ పార్టీలు గట్టిగా స్పందించాలని కవిత సూచించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా మహిళలు వీరోచితంగా పోరాడినప్పటికీ, చరిత్రలో వారికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల చరిత్రను మహిళలే రాసుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సమాజం, రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలని, ‘తెలంగాణ రుద్రమ సేన’ ద్వారా వారికి మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.