మినిట్2మినిట్ డెస్క్, హైదరాబాద్: నగరంలోని దోమలగూడ రామకృష్ణ మఠంలో ఉన్న ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ (VIHE) ఆధ్వర్యంలో యువతీ యువకులు, ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా “ఇంట్రడక్షన్ టు మెడిటేషన్” (ధ్యాన పరిచయం) అనే ఆఫ్-లైన్ కోర్సును నిర్వహించనున్నారు. జూలై 20 నుంచి 22 వరకు (సోమవారం నుంచి బుధవారం వరకు) మూడు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద స్వయంగా ఈ కోర్సుకు మార్గదర్శకత్వం వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6:15 గంటల నుంచి రాత్రి 7:45 గంటల వరకు తరగతులు ఉంటాయి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ శిక్షణలో పాల్గొనడానికి అర్హులు.
ఏం నేర్పిస్తారు?
ఈ 3 రోజుల శిక్షణలో ధ్యానం ప్రాముఖ్యత, యోగా-వేదాంతాల ప్రకారం ధ్యానం చేసే పద్ధతులు, ఏకాగ్రతకు-ధ్యానానికి మధ్య ఉన్న తేడాలు, నిత్యజీవితంలో ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు, ధ్యానానికి సంబంధించిన సిద్ధాంతాలు, ప్రాక్టికల్ పద్ధతులను నేర్పిస్తారు.
ఈ కోర్సు ప్రవేశ రుసుము రూ. 300/- గా నిర్ణయించారు. ఆసక్తి గల వారు www.vihehyd.org వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 91 77 23 26 96 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
